Money Laundering: డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై 2018లో నమోదైన మనీ లాండరింగ్‌ కేసును సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టివేసింది.

Updated : 05 Mar 2024 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై 2018లో నమోదైన మనీ లాండరింగ్‌ కేసును సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టివేసింది. పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలతో ఆయనపై మోపిన అభియోగాలు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్‌ 2019లో డీకేను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ (DK Shivakumar)తోపాటు ఆయన సన్నిహితుల నివాసాలపై 2017లో ఆదాయపన్ను శాఖ దాడులు జరిపింది. దేశవ్యాప్తంగా చేసిన ఆ దాడుల్లో భారీ నగదును ఐటీ శాఖ గుర్తించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈక్రమంలో ఈడీ ఇచ్చిన సమన్లు కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును డీకే ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించకపోవడంతో 2019లో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. రికవరీ చేసిన నగదు మనీలాండరింగ్‌కు సంబంధించిందని నిరూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేసింది.

కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి?

ఈ కేసును ఈడీ విచారణ చేస్తోన్న సమయంలోనే డీకేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అప్పటి ప్రభుత్వం సమ్మతి తెలిపింది. అయితే, కర్ణాటకలో ఇటీవల ఏర్పడిన సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఈ కేసును సీబీఐకి అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇలా తనపై నమోదైన కేసుపై గతంలో పలుమార్లు స్పందించిన శివకుమార్‌.. తప్పుడు అభియోగాలు మోపారని, ఇది భాజపా ప్రతీకార రాజకీయాల్లో భాగమేనని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని