Supreme Court: పొన్ముడి విషయం 24 గంటల్లో తేల్చండి.. తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం సీరియస్‌

Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన కోర్టును ధిక్కరిస్తున్నారని, ఇది ఆందోళనకరమని పేర్కొంది. అసలేం జరిగిందంటే..

Published : 21 Mar 2024 17:14 IST

దిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రకారం తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలో చేర్చేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి (Tamil Nadu Governor RN Ravi) నిరాకరించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన కోర్టును ధిక్కరిస్తున్నారని హెచ్చరించింది. ఈ అంశంపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో డీఎంకే నేత, మాజీ మంత్రి పొన్ముడి (Ponmudi), ఆయన సతీమణి విశాలాక్షికి మద్రాసు హైకోర్టు గతంలో జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అనంతరం ఈ జైలుశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేయడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్‌ ఇటీవల ప్రకటించారు.

‘ఇప్పుడు చట్టాన్ని ఆపితే గందరగోళమే’.. ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

ఈ క్రమంలోనే పొన్ముడిని మళ్లీ మంత్రిగా పదవీప్రమాణం చేయించాలని సీఎం స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేశారు. ఇందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నిరాకరించారు. జైలు శిక్షపై స్టే మాత్రమే వచ్చిందని, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో స్టాలిన్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గవర్నర్‌ తీరుపై సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

‘‘గవర్నర్‌ వ్యవహార శైలి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆయన సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు. ఇలా చేయడం తగదు. అడ్వైజర్లు ఆయనకు సరిగా సలహాలు ఇవ్వట్లేదు. శిక్షపై మేం స్టే ఇచ్చామంటే.. అది నిలిచిపోయినట్లే. ఒక వ్యక్తి/మంత్రిపై మనకు విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందే. 24 గంటల్లోగా ఈ అంశాన్ని గవర్నర్‌ తేల్చాలి. లేదంటే మేమే ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని