Arvind Kejriwal: మోదీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు.. కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ప్రధాని మోదీ (PM Modi) డిగ్రీ అంశంపై వ్యాఖ్యలు చేసిన కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 25 Aug 2023 17:31 IST

దిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) డిగ్రీ అంశంలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువునష్టం (defamation case) కలిగించాయని గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట లభించలేదు. ఈ కేసులో తనపై చర్యలు తీసుకోకుండా విచారణపై స్టే విధించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది.

ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం గుజరాత్‌ హైకోర్టు ఎదుట పెండింగ్‌ ఉందని, అందువల్ల తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై కేజ్రీవాల్‌, గుజరాత్‌ యూనివర్సిటీ తమ వినతులను హైకోర్టుకు సమర్పించుకోవచ్చని సూచించింది.

బ్యాడ్మింటన్‌ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?: సీబీఐ

ఈ పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం గుజరాత్‌  మెట్రోపాలిటన్‌ కోర్టుకు రావాలని గతంలో న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను సవాల్‌ చేస్తూ ఆయన సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తిరస్కరించడంతో ఇటీవల ఆయన గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఊరట లభించలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ (PM's degree) చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఆ సమాచారం ఇవ్వాలంటూ ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. ఈ కేసులో సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగ పరిచారంటూ కక్షిదారు అరవింద్‌ కేజ్రీవాల్‌కు రూ.25 వేలు జరిమానా విధించింది. అయితే, ఈ తీర్పు తర్వాత తమ విద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని కేజ్రీవాల్‌, సంజయ్‌ అవమానకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్‌ వర్సిటీ వీరిపై పరువు నష్టం దావా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని