Supreme Court: కోర్సు ఎందుకు.. హైస్కూల్‌ తర్వాతే లా ప్రాక్టీస్‌ చేయండి: సుప్రీం ఆగ్రహం

Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్‌ తర్వాతే ప్రాక్టీస్‌ చేయండంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 22 Apr 2024 15:04 IST

దిల్లీ: ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్‌ఎల్‌బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందులో ఆలోచించడానికి ఏం లేదని, ప్రస్తుత కోర్సు విధానం సరిగ్గానే ఉందని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది.

ప్రస్తుతం.. డిగ్రీ పూర్తి చేసినవారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్‌ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. అయితే, ఇంటర్‌ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పేదలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

బెంగాల్‌లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్‌ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్‌ మొదలుపెట్టేయండి’’ అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవానికి న్యాయవిద్యకు ఐదేళ్ల కోర్సు కూడా తక్కువే. అయితే ప్రస్తుత విధానం సరిగ్గానే పనిచేస్తోంది. దీనిపై ఆలోచించడానికి ఏం లేదు. ఇక, ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థల్లో 70శాతం మంది మహిళలు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతమంది ఇందులో చేరుతారు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు