Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. మరికొన్ని రోజులు జైల్లోనే

Arvind Kejriwal: తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అటు ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించారు.

Updated : 15 Apr 2024 15:11 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Scam Case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు, ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించారు. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైల్లోనే ఉండనున్నారు.

మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఇటీవల దిల్లీ హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్‌ 24లోగా తమ స్పందన తెలియజేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. దీనిపై ఏప్రిల్‌ 29 తర్వాత విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది.

సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద పోలీసు వాహనం మిస్సింగ్‌.. కాల్పుల ఘటనలో కీలక విషయం

2021-22 నాటి దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఆ కస్టడీ నేటితో ముగియనుండటంతో సీఎంను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరుపర్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సీఎంను మరికొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉంచాలని ఈడీ కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్‌ 23 వరకు కస్టడీని పొడిగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని