Fact Check Unit: కేంద్రం ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ యూనిట్‌పై సుప్రీం స్టే

Fact Check Unit: ఆన్‌లైన్‌ సమాచార పర్యవేక్షణ కోసం ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

Published : 21 Mar 2024 14:48 IST

దిల్లీ: నకిలీ సమాచారాన్ని అడ్డుకునేలా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ (Fact Check Unit) ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. దీనిపై బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌ఫై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది.

ఆన్‌లైన్‌ కంటెంట్‌లో నకిలీ (Fake News), తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో పేర్కొంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021కు సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఐటీ నిబంధనల (New IT Rules) చెల్లుబాటును సవాల్‌ చేస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తదితరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

‘వాట్సప్‌లో వికసిత భారత్‌ సందేశాలు ఆపండి’: కేంద్రానికి ఈసీ ఆదేశం

దీనిపై గతంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటీషనర్లు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 నాటి హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ‘‘ఈ యూనిట్‌ ఏర్పాటుపై హైకోర్టు ముందుకొచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు మార్చి 20న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే విధిస్తున్నాం’’ అని కోర్టు స్పష్టం చేసింది.

ఏంటీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం?

కేంద్రం ప్రభుత్వ వివరాల ప్రకారం.. ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉంటే వాటిని ఈ విభాగం ఫ్లాగ్‌ లేదా ఫ్యాక్ట్‌చెక్‌ చేస్తుంది. అలా ఫ్లాగ్‌ చేస్తే ఆయా మీడియా సంస్థలు ఆ వార్తలను తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏదైనా నకిలీ లేదా అసత్య సమాచారం ప్రసారం అవుతుంటే, కొన్ని వార్తా సంస్థలు, ప్రైవేట్‌ ఫ్యాక్ట్‌చెక్‌ సంస్థలు వాటిని విశ్లేషించి అవి నకిలీవా? కాదా? అనేది తెలుసుకుంటాయి. కానీ, ప్రభుత్వం ఏర్పాటుచేసిన విభాగం కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను మాత్రమే విశ్లేషిస్తుంది. వాటిలో ఏవైనా లోపాలుంటే తొలగించాలని సూచిస్తుంది. అలా తొలగించని సంస్థలు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని