Electoral bonds: ఎస్‌బీఐ అభ్యర్థనపై మార్చి 11న ‘సుప్రీం’లో విచారణ

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు గడువు పొడిగించాలన్న ఎస్‌బీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మార్చి 11న విచారణ జరపనుంది.

Published : 08 Mar 2024 18:04 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు మరింత గడువు కోరుతూ ఎస్‌బీఐ (SBI) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme court) మార్చి 11న విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు, ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోపు ఈసీకి సమర్పించాలంటూ గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఎస్‌బీఐపై ఏడీఆర్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పైనా అదేరోజు వాదనలు విననుంది.

ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

దేశంలో ఎన్నికల బాండ్ల (Election Bonds)ను రద్దు చేయడంతో పాటు 2019 ఏప్రిల్‌ 12 నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను ఈనెల 6వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి సమర్పించాలని SBIని ఆదేశిస్తూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, మార్చి 13 నాటికి ఎన్నికల బాండ్లు ఇచ్చిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీకి ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలంటూ ఈనెల 4న ఎస్‌బీఐ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌).. ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించడంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించలేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు, విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడించకూడదనే ఉద్దేశంతోనే బ్యాంకు అధికారులు గడువు కోరుతున్నారని ఆరోపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని