ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిర్ణీత గడువును పాటించడంలో విఫలమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)పై గురువారం కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది.

Updated : 08 Mar 2024 05:37 IST

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఏడీఆర్‌

దిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిర్ణీత గడువును పాటించడంలో విఫలమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)పై గురువారం కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌బీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేసింది. ఇటీవల ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ, 2019 ఏప్రిల్‌ 12 నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను ఈ నెల 6వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ ఎస్‌బీఐని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, బాండ్ల వివరాలను వెల్లడించడానికి జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని ఈ నెల 4న ఎస్‌బీఐ... సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై ఏడీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు, విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడించకూడదనే ఉద్దేశంతోనే పొడిగింపును ఎస్‌బీఐ కోరిందని ఆరోపించింది. ఈ నెల 11న బ్యాంకు అభ్యర్థన విచారణకు వచ్చే అవకాశం ఉందని, దాంతో పాటు తమ ధిక్కరణ పిటిషన్‌ను కూడా వినాలని ఏడీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోరారు. దీనికి ‘‘మీరు ఈ-మెయిల్‌ పంపండి, నేను ఆదేశాలిస్తాను’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ స్పందించారు.

జాతీయ పార్టీల గుప్త నిధుల్లో 82.42 శాతం ఎన్నికల బాండ్ల నుంచే...

రాజకీయ పార్టీలు అందుకున్న గుప్త నిధుల్లో 82.42 శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే సమకూరాయని ఏడీఆర్‌ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు జాతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్‌ నివేదికలు, విరాళాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. అజ్ఞాత దాతల ద్వారా మొత్తం రూ.1,832.88 కోట్లు... భాజపా, కాంగ్రెస్‌, సీపీఎం, బీఎస్పీ, ఆప్‌, ఎన్‌పీఈపీలకు చేరగా అందులో రూ.1,510 కోట్లు (82.42శాతం) ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన ఆదాయమేనని తెలిపింది. రూ.1,832.88 కోట్ల నిధుల్లో భాజపాకి అత్యధికంగా రూ.1,400 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు రూ.315.11 కోట్లు అందాయి. 2004-05 నుంచి 2022-23 మధ్య కాలంలో అజ్ఞాత దాతల ద్వారా రాజకీయ పార్టీలు రూ.19,083 కోట్లు సేకరించాయని ఏడీఆర్‌ వెల్లడించింది.

సమాచారం సిద్ధంగా లేదనడం అసంబద్ధం

ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం సిద్ధం లేదని ఎస్‌బీఐ పేర్కొనడం అసంబద్ధంగా ఉందని పిటిషన్‌లో ఏడీఆర్‌ పేర్కొంది. ‘‘ప్రతి ఎన్నికల బాండ్‌కు ఓ రహస్య నంబరు ఉంటుంది. బాండును కొనుగోలు చేసిన వారి కేవైసీ వివరాలను కూడా ఎస్‌బీఐ తీసుకుంది. కొనుగోలుదారుడు ఎవరో ఎస్‌బీఐకి తెలుసు. 2024 జనవరి డేటా ప్రకారం.. ఎన్నికల బాండ్లను తీసుకోవడానికి కేవలం 25 రాజకీయ పార్టీలకే అర్హత ఉంది. కాబట్టి ఆ సమాచారం క్రోడీకరించడం కష్టమేమీ కాదు’’ అని తెలిపింది.

బండారం బయటపడకూడదనే గడువు నాటకం: కాంగ్రెస్‌

ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి మరింత గడువు కావాలని ఎస్‌బీఐ సుప్రీంకోర్టును కోరడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. ఎస్‌బీఐని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రక్షణ కవచంగా వినియోగించుకుంటోందని ఆరోపించింది. తమకు నిధులు సమకూర్చిన కార్పొరేట్‌ మిత్రుల వివరాలు ప్రజలకు ఎక్కడ తెలిసిపోతాయోనని ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఎస్‌బీఐకి మూడు వారాల పాటు సుప్రీంకోర్టు సమయమిస్తే.. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు గడువు కోరడం ఏంటని ప్రశ్నించారు. ఎస్‌బీఐ వద్ద విరాళాలు ఇచ్చినవారు, అందుకున్న రాజకీయ పార్టీల వివరాలు కచ్చితంగా ఉంటాయని రమేశ్‌ అన్నారు. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిలో ఎస్‌బీఐ వైఖరిని సీపీఎం, శివసేన (యూబీటీ) కూడా తప్పుపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని