Article 370: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ఓ ఆశాకిరణం: మోదీ హర్షం

Article 370: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తుకు ఈ తీర్పు ఓ ఆశాకిరణం అని కొనియాడారు. 

Updated : 11 Dec 2023 13:34 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370 (Article 370)’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు.

‘‘ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. 2019 ఆగస్టు 5న భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ సోదరసోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది. భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం. ఆర్టికల్‌ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తాం. ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదు.. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు.

జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమే: సుప్రీం కీలక తీర్పు

సుప్రీం కోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తుండగా.. పలు పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ తీర్పుపై ఎవరేమన్నారంటే..

  • ‘‘ఆర్టికల్‌ 370 రద్దు పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత.. పేదలు, అణగారిన వర్గాల హక్కులను పునరుద్ధరించగలిగాం. వేర్పాటువాదం, రాళ్లు రువ్వే ఘటనలు ఇక గతమే. దేశ ఐక్యత, సమగ్రత నేడు మరింత బలపడింది’’ - కేంద్ర హోంమంత్రి అమిత్ షా

  • ‘‘తీర్పును మేం స్వాగతిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. అంతకంటే ముందు పీవోకేను భారత్‌లో విలీనం చేయాలి’’ - శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే

  • ‘‘సుప్రీం తీర్పును భాజపా స్వాగతిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ సర్కారు ఎంతగానో కృషి చేస్తోంది’’ - భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
  • ‘‘ఈ తీర్పు విచారకరం. దీనిపై జమ్మూకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరు. కానీ సుప్రీం తీర్పును మనం అంగీకరించాల్సిందే’’ - జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులామ్‌ నబీ ఆజాద్‌
  • ‘‘తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాం. కానీ నిరుత్సాహపడట్లేదు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి భాజపాకు కొన్ని దశాబ్దాలు పట్టింది. మేం కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడుతున్నాం. దీనిపై మా పోరాటం కొనసాగుతుంది’’ - నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని