Bomb Threat: చెన్నై వ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Bomb Threat: చెన్నైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Updated : 08 Feb 2024 18:52 IST

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లోని పలు స్కూళ్ల (Schools)కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. నగర వ్యాప్తంగా ఐదు పాఠశాలలకు గురువారం బెదిరింపు (Bomb Threat) ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపించి పాఠశాలలను మూసివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.

గోపాలపురం, జేజేనగర్‌, ఆర్‌ఏ పురం, అన్నానగర్‌, పరిముణా ప్రాంతాల్లోని ఐదు ప్రముఖ పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయా స్కూళ్లలో బాంబు స్క్వాడ్‌, జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ఈ-మెయిల్‌ పంపిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

భారత్‌-మయన్మార్‌ మధ్య ఇక యథేచ్ఛగా రాకపోకలు కుదరవ్‌

ఇటీవల బెంగళూరులోనూ పలు పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గత డిసెంబరులో ఒకే రోజు 68 పాఠశాలలను బెదిరిస్తూ దుండగులు ఈ-మెయిల్‌ పంపారు. దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అవి నకిలీ బెదిరింపులేనని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని