Scindia: రాహుల్‌ నుంచి నేర్చుకోవాలంటూ సింధియాకు ప్రశ్న.. మంత్రి సమాధానమిదే..?

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) ఓ నెటిజన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 07 Jul 2023 14:32 IST

భోపాల్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నుంచి నేర్చుకోండంటూ ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలను భాజపా నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా ఆయన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో సింధియా(Jyotiraditya Scindia).. రెస్టారెంట్‌లోని వారిని ఆత్మీయంగా పలకరించారు. ఓ వృద్ధురాలి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడున్నవారు సింధియా జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ‘రుచికరమైన ఆహారం ఆస్వాదించడంతో పాటు దానిని వండినవారిని కలవడమూ అంతే ముఖ్యం. నేను గ్వాలియర్‌లో పర్యటించిన సమయంలో రెస్టారెంట్ సిబ్బందిని కలుసుకున్నాను. రకరకాల వంటల గురించి, స్థానిక అంశాల గురించి మాట్లాడాను’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘రాహుల్‌ గాంధీ నుంచి నేర్చుకోండి. అది మంచిది’ అని విమర్శనాత్మకంగా సింధియాకు సూచన చేశారు. దానికి మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవంగా నేర్చుకున్నది వదిలించుకోవాలని బదులిచ్చారు. 

ఇదీ చదవండి: పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

సింధియా.. 2020లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన తిరుగుబాటు చేయడంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత సింధియా భాజపా(BJP)లో  చేరారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోపక్క కొద్దినెలల క్రితం రాహుల్.. భారత్‌ జోడో యాత్రను నిర్వహించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఆయన దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ ఆ వైఖరి కొనసాగిస్తున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని