Radhika SarathKumar: భార్య గెలవాలని.. హీరో పొర్లు దండాలు: వీడియో వైరల్‌

Radhika SarathKumar: లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య విజయాన్ని కాంక్షిస్తూ సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ పొర్లుదండాలు పెట్టారు. ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

Updated : 03 Jun 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన నటనతో దక్షిణాదిన సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి రాధికా శరత్‌ కుమార్‌ (Radhika SarathKumar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులోని విరుద్‌నగర్‌ (Virudhunagar) స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఆమె విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కాంక్షిస్తూ రాధిక భర్త, సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివారం రాత్రి విరుద్‌నగర్‌లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్‌ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శరత్‌ కుమార్‌ (SarathKumar) ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. రాధిక తరఫున ఎన్నికల ప్రచారంలోనూ ఈ నటుడు చురుగ్గా పాల్గొన్నారు.

9 ఓట్ల తేడాతో వీళ్లు.. 98శాతం ఓట్లతో వాళ్లు: లోక్‌సభ ఎన్నికల్లో ఈ రికార్డులు తెలుసా?

2006లో రాధిక (Radhika SarathKumar) రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను భాజపా (BJP)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కమలం పార్టీ టికెట్ దక్కింది.

ఇక విరుద్‌నగర్‌ స్థానం నుంచి నటికి పోటీగా దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ బరిలో ఉన్నారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయన నిలబడ్డారు. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ మరోసారి పోటీ చేశారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. మరి ఈ ఆసక్తికర సమరంలో రాధికను గెలుపు వరిస్తుందో, లేదో తెలియాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు