North India Rain Fury: ఉత్తర భారత్‌లో పలుచోట్ల రెడ్‌అలర్ట్‌.. దిల్లీలో రికార్డుస్థాయి వర్షపాతం..!

ఉత్తర భారత్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలో గత 40ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో  ఒక్కరోజు వర్షపాతం నమోదైంది.

Updated : 09 Jul 2023 11:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర భారత దేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతోపాటు మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ముప్పు ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో వర్షాలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలో ఓ పర్యాటక వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇక దిల్లీలో గత 40 ఏళ్లలో ఎన్నడు లేనంత స్థాయిలో భారీ వర్షాలు పడ్డాయి. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15 శాతానికి సమానం. ఈ స్థాయి వర్షాలు 1982 జులైలో కురిశాయి. నేడు కూడా దిల్లీలో వర్షాల జోరు కొనసాగనుంది. దిల్లీలోని ఓ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలి 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షాల కారణంగా అత్యవసర సేవల విభాగాల్లో వారాంతపు సెలవులను రద్దు చేశారు.

ఇక రాజస్థాన్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలోని తొమ్మిది జల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

జమ్మూలోని రెండు జిల్లాల్లో వరదల ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ముప్పు ఉన్న కతువా, సాంబ జిల్లాల్లో మూడో రోజు కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నదీపరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని