Gutka ad case: ముగ్గురు బాలీవుడ్‌ అగ్రనటులకు కేంద్రం షోకాజ్ నోటీసులు!

Gutka ad case: ఓ గుట్కా కేసులో షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు తెలియజేసింది.

Updated : 10 Dec 2023 12:18 IST

లఖ్‌నవూ: గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ మేరకు ముగ్గురు బాలీవుడ్‌ అగ్రనటులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు.

అగ్రనటులు కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవ దహనం

దీనిపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn)కు అక్టోబర్‌ 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని న్యాయస్థానానికి పాండే తెలియజేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని తెలిపారు. దీంతో అమితాబ్‌ సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపారని చెప్పారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పాండే కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని