Azam Khan: ఎస్పీ నేత అజంఖాన్‌కు ఊరట.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!

ఎస్పీ (SP) సీనియర్‌ నేత అజంఖాన్‌ (Azam Khan)ను నిర్దోషిగా తేలుస్తూ రాంపూర్‌ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అజంఖాన్‌ ఎమ్మెల్యే పదవిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. 

Updated : 24 May 2023 17:59 IST

లఖ్‌నవూ: విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో సమాజ్‌వాద్‌ పార్టీ (SP) సీనియర్‌ నేత అజంఖాన్‌ (Azam Khan)కు ఊరట లభించింది. రాంపూర్‌ అదనపు జిల్లా కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు, ఐఏఎస్‌ అధికారిపై అజంన్‌ఖాన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాంపూర్‌ కోర్టులో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అజంఖాన్‌ను దోషిగా తేలుస్తూ మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో అజంఖాన్‌ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. 

ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అజంఖాన్‌ రాంపూర్‌ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అజంఖాన్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. అయితే, గతంలో ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన తీర్పుతో అజంఖాన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించారు. దీంతో రాంపూర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అవడంతో ఆ స్థానానికి గతేడాది డిసెంబర్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో భాజపా అభ్యర్థి ఆకాశ్‌ సక్సేనా, ఎస్పీ తరపున పోటీ చేసిన ఆసిమ్‌ రాజాపై గెలుపొందారు. అయితే, తాజా తీర్పుతో అజంఖాన్‌ నిర్దోషిగా తేలడంతో ఆయన ఎమ్మెల్యే పదవిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని