Soldiers: సైనికుల పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది..? వైరల్‌గా ఐఏఎఫ్‌ అధికారిణి పోస్టు

సైనికులే కాదు, సైనికుల పిల్లలు కూడా తమ వంతు దేశ సేవ చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌(IAF) స్క్వాడ్రన్ లీడర్‌ పెట్టిన పోస్టు చదివితే ఈ మాట నిజం అనిపించకమానదు.  

Published : 21 Oct 2023 10:43 IST

దిల్లీ: నిత్యం దేశసేవలో ఉంటూ, దేశ రక్షణలో భాగంగా అవసరమైతే ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉంటారు మన సైనికులు(soldiers). అలాగే విధుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా చిన్నతనంలో సైనికుల పిల్లలు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటుంటారు..? ఈ విషయాల గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) స్క్వాడ్రన్ లీడర్‌ నిహారికా హండా(Squadron Leader Niharika Handa) సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

‘సైనికుల పిల్లలు(Fauji Kids) అద్భుతమైనవారు. వారు ఒక ఇంటితో, తమ చుట్టుపక్కల చిన్నారులతో అనుబంధం ఏర్పరచుకునేలోపు తమ తల్లిదండ్రుల వృత్తిరీత్యా ఆ ప్రాంతాన్ని వీడుతుంటారు. పెద్దల కోసం తమ ఇష్టాలను, స్నేహాలను వీడాల్సి వస్తుంది. ఒకే దగ్గర స్థిరంగా చదువుకునే పరిస్థితి ఉండదు. ఈ మార్పు వారి జీవితంలో ఒక భాగం. మన స్నేహితులు, మన అలవాట్లకు గుడ్‌బై చెప్పేసి, కొత్త ప్రాంతానికి వెళ్లడం అంత సులభమేమీ కాదు. వీడ్కోలు పదం ఈ చిన్నారుల జీవితంలో తరచూ వినిపిస్తుంది. ఈ ప్రయాణంలో వారు ఎనలేని ధైర్యసాహసాలు, చొరవ చూపిస్తుంటారు. ఈ రకంగా వారు కూడా దేశానికి సేవ చేస్తున్నారు. ఈ పిల్లలందరి పట్ల నాకెంతో గర్వంగా ఉంది’ అంటూ సైనికుల బిడ్డలను నిహారిక అభినందించారు. విధుల్లో భాగంగా నిత్యం బిజీగా ఉండే తనకు తన బిడ్డ అందిస్తోన్న సహకారాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఇంత చిన్నవయసులోనే నాకు, మీ నాన్నకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు నాన్నా’ అంటూ తన చిన్నారితో దిగిన చిత్రాన్ని షేర్ చేశారు.

గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

ఆమె చేసిన పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంది. ఇలా స్నేహితుల్ని, చదువుతున్న పాఠశాలను వదిలి కొత్త ప్రాంతానికి వెళ్లడం అంత సులభం కాదంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఒక సైనికుడి బిడ్డగా ఈ పోస్టులో ప్రతి పదం నా జీవితంలోనిదే. ప్రతిసారి ఉన్న ప్రాంతాన్ని వీడటం ఒక సవాలే కాదు.. ఎదగడానికి అవకాశం కూడా’ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. ఆ పిల్లలు త్వరగా అందరితో కలిసిపోతారని, త్వరగా స్నేహితుల్ని ఏర్పరచుకుంటారని, వారితో ఎప్పటినుంచో పరిచయం ఉందనే భావన కలుగుతుందని ఇంకొకరు తన అనుభవాన్ని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని