Gaganyaan Test Flight: గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

Gaganyaan Test Flight: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్షను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఇందులోని క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా సముద్ర ఉపరితలంపై దిగింది.

Updated : 21 Oct 2023 11:01 IST

శ్రీహరికోట: రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ (Gaganyaan) సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో (ISRO) శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది.

ప్రయోగం సాగిందిలా..

రాకెట్‌ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు ‘అబార్ట్‌’ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.

తొలుత స్వల్ప అంతరాయం..

తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించగా.. ఈ సన్నాహక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.

ప్రయోగం విజయవంతమైంది: సోమనాథ్‌

టీవీ-డీ1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ శాస్త్రవేత్తలను అభినందించారు. ‘‘టీవీ-డీ1 మిషన్‌ను విజయవంతంగా పరీక్షించాం. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగాం. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాని సరిచేసి మళ్లీ ప్రయోగించాం. క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది’’ అని సోమనాథ్‌ వెల్లడించారు.

ఏమిటీ పరీక్ష?

గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను ఈ సన్నాహక పరీక్షలో పరిశీలించారు. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ ఇస్రో పరీక్షిస్తుంది.

క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ ఎందుకు?

మానవసహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్‌లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్‌ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ (సీఈఎస్‌) అంటారు. ఇది ఒకరకంగా ‘ఎమర్జెన్సీ ఎగ్జిట్‌’ అన్నమాట! ఆ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షించారు. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ చాలా చురుగ్గా, మెరుపు వేగంతో పనిచేయాలి. ఈ దిశగా క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ కోసం ‘క్విక్‌ రియాక్టింగ్‌ సాలిడ్‌ మోటార్ల’ను ఇస్రో అభివృద్ధి చేసింది. ఇవి చాలా వేగంగా ప్రజ్వరిల్లి, అధిక థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. మొత్తం ఐదు రకాల రాకెట్‌ మోటార్లు ఇందులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని