Stalin: సీఎం స్టాలిన్‌ ‘పొంగల్‌’ గిఫ్ట్‌.. ₹1000 నగదు, చెరకు గడ పంపిణీ!

 తమిళనాడు సీఎం స్టాలిన్‌ అక్కడి ప్రజలకు ‘పొంగల్‌’ కానుక అందజేశారు. ₹1000 నగదుతో పాటు చెరకు గడ, బియ్యం, పంచదార పంపిణీ చేశారు.

Updated : 10 Jan 2024 17:05 IST

చెన్నై: సంక్రాంతి వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK stalin) ‘పొంగల్‌’ కానుక (Pongal Gift)ను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల మంది  రేషన్‌కార్డు దారులకు రూ.1000 నగదుతో పాటు బియ్యం, పంచదార, చెరకు గడలను అందజేసే ఈ కార్యక్రమాన్ని  లాంఛనంగా ప్రారంభించారు. పండుగ వేళ ఇంట్లో ఆనందాన్ని నింపే ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం అందరి హృదయాల్లో, ఇళ్లల్లో వర్ధిల్లాలని, ప్రతిచోటా ఆనందం నిండాలని ఆకాంక్షించారు. దీంతో పాటు లబ్ధిదారులకు ఉచిత ధోతీ, చీరల పంపిణీని సైతం ప్రారంభించారు.

బిల్కిస్‌ బానో కేసు.. దోషుల్లో 9 మంది మిస్సింగ్‌!

తమిళనాడులోని 2కోట్ల మందికి పైగా రేషన్‌ కార్డుదారులతో పాటు పునరావాస శిబిరాల్లోని శ్రీలంక తమిళులకు రూ.1000 నగదుతో పాటు చెరకు గడ, కిలో బియ్యం, కిలో పంచదారను ‘పొంగల్‌’ కానుకగా రేషన్‌ దుకాణాల ద్వారా  పంపిణీ చేయనున్నారు.  ఈ కానుకల పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్లు జారీ చేశారు. ఎవరు ఏ రోజు, ఏ సమయంలో రేషన్‌ దుకాణం వద్దకు వచ్చి కానుకలను  తీసుకెళ్లాలనే వివరాలను ఆ టోకెన్లలో సూచించారు.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం తమిళనాడులో 2,19,71,113 బియ్యం కేటగిరీ రేషన్‌ కార్డుదారులు ఉండగా.. వారందరికీ ఈ కానుకల్ని పంపిణీ చేసేందుకు  రూ.2,436.19 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా.  అలాగే, 1.77 కోట్ల ధోతీలు, చీరల్ని సైతం పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా నిరుపేద, సామాన్య ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు