Amul Row: ఈసారి అమూల్‌ vs అవిన్‌.. తమిళనాడులో పాల రగడ

Amul vs Aavin: తమిళనాడు సహకార సంఘాల నుంచి పాల సేకరణ చేపట్టేందుకు అమూల్‌ సంస్థ చర్చలు జరపడం తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా స్పందిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

Published : 25 May 2023 18:15 IST

చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కన్నడ నాట ‘అమూల్‌ (Amul)’ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా మరో దక్షిణాది రాష్ట్రంలోనూ ఈ వివాదం మొదలైంది. గుజరాత్‌కు చెందిన ఈ ప్రముఖ డైరీ బ్రాండ్‌.. తమిళనాడు (Tamil nadu)లో పాలను సేకరిచేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. రాష్ట్రం ప్రభుత్వ డైరీ సంస్థ అవిన్‌ (Aavin) బ్రాండ్‌కు ఆదరణ తగ్గే ప్రమాదముందని ఆందోళనలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన స్టాలిన్‌ (MK Stalin) సర్కారు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah)కు లేఖ రాశారు. తమిళనాడు నుంచి పాల సేకరణను ఆపేలా అమూల్‌ను ఆదేశించాలని కోరారు. అసలేం జరిగిదంటే.. (Amul vs Aavin)

గుజరాత్‌కు చెందిన అమూల్‌ (Amul) బ్రాండ్‌.. పలు రాష్ట్రాల్లోని రైతు సహకార సంఘాల నుంచి పాలను సేకరించి తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. అలాగే.. తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో పాలను సేకరించేందుకు అమూల్‌ అక్కడి రైతులతో చర్చలు జరుపుతోంది. తమిళనాడు డైరీ కోఆపరేటివ్‌ బ్రాండ్‌ అవిన్‌ ఇచ్చిన దానికంటే ఎక్కువ ధరను పాలను కొనుగోలు చేస్తామని అమూల్‌ ప్రతినిధులు రైతులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్‌.. గురువారం అమిత్‌ షాకు లేఖ రాశారు.

అవిన్‌ను దెబ్బతీసేందుకే..

‘‘అమూల్‌ డైరీకి చెందిన కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం.. తన బహుళ-రాష్ట్ర సహకార లైసెన్స్‌ను ఉపయోగించి కృష్ణగిరి జిల్లాలో శీతలీకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), స్వయం సహాయక సంఘాల ద్వారా పాలను సేకరించాలని అమూల్‌ యోచిస్తోంది. ఇది ‘ఆపరేషన్‌ శ్వేత విప్లవం’ స్ఫూర్తికి విరుద్ధం. దీనివల్ల పాల కొరతతో పాటు వినియోగదారులకు సమస్యలు ఎదురవుతాయి. అమూల్‌ చర్య.. అవిన్‌ (Aavin) పాల సమాఖ్య ప్రయోజనాలను అణచివేసినట్లే’’ అని స్టాలిన్‌ తన లేఖలో పేర్కొన్నారు.

అంతేగాక, అమూల్‌ పాల సేకరణ వల్ల పాల ఉత్పత్తులను సేకరించి, విక్రయించే సహకార సంఘాల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తుందని సీఎం ఆరోపించారు. ప్రాంతీయ సహకార సంఘాలు రాష్ట్రాల్లో పాడిపరిశ్రమ అభివృద్ధికి పునాదిగా ఉన్నాయని, ధరలు ఏకపక్షంగా పెరగకుండా ఇవి ఉపయోగపడుతున్నాయని స్టాలిన్‌ గుర్తుచేశారు. అందువల్ల, ఈ వ్యవహారంలో వెంటనే కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని.. పాల సమాఖ్య నుంచి అమూల్‌ పాలు సేకరించకుండా తక్షణమే ఆదేశాలివ్వాలని సీఎం తన లేఖలో కోరారు.

ఇటీవల కర్ణాటకలోనూ అమూల్‌ బ్రాండ్‌ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. బెంగళూరులో ఆన్‌లైన్ డెలివరీలను ప్రారంభిస్తామని అమూల్‌ చేసిన ట్వీట్ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. దీంతో ఎన్నికల వేళ ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. భాజపాపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని