Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్‌లో 6 రాష్ట్రాలు అలర్ట్‌..!

Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపథ్యంలో.. ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని ఇటీవల భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి.

Updated : 29 Nov 2023 12:22 IST

దిల్లీ: చైనా (China)లో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (Respiratory Infections).. ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భారత (India) ప్రభుత్వం ఇటీవల దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి.

  • సీజనల్‌ ఫ్లూ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ సూచించింది. సీజనల్‌ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కును కవర్‌ చేసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొంది. పదే పదే చేతులతో ముఖాన్ని తాకవద్దని తెలిపింది.
  • ఈ శ్వాసకోశ వ్యాధి పట్ల ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజస్థాన్‌ ఆరోగ్యశాఖ తమ అడ్వైజరీలో వెల్లడించింది. అయితే, ఈ ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించింది. పిడియాట్రిక్‌ యూనిట్లలో అన్ని వసతులను అందుబాటులో ఉంచాలని సూచించింది.
  • ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తర్‌కాశీ, పిఠోర్‌గఢ్‌ జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో శ్వాసకోశ సమస్య కేసులపై నిఘా పెట్టాలని పేర్కొంది.
  • అసాధారణ శ్వాసకోశ సమస్యలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితో ఆ సమాచారాన్ని తక్షణమే రిపోర్ట్‌ చేయాలని హరియాణా ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది.
  • తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలు కూడా ఇదే విధమైన అడ్వైజరీలు జారీ చేశాయి. ఫ్లూ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించాయి.

తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ

చైనాలో గత కొన్ని రోజులుగా నిమోనియా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే, అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని, ఈ కేసుల్లో కొత్త వైరస్‌లను గుర్తించలేదని చైనా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రజారోగ్య సంరక్షణ, ఆస్పత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మానవ వనరులు, ఆస్పత్రి పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌, యాంటీబాడీలు, పీపీఈ, టెస్టు కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు