India: భారతీయులూ.. యుద్ధానికి దూరంగా ఉండండి : విదేశాంగ శాఖ సూచన

భారత్‌ యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి.. అక్కడ యుద్ధంలోకి దింపిన విషయంపై మన విదేశాంగ శాఖ స్పందించింది.  

Published : 23 Feb 2024 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ నుంచి దాదాపు 100 మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారన్న వార్తలపై మన ప్రభుత్వం స్పందించింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. కొందరు భారతీయులు అక్కడి సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈవిషయంపై తాము మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అక్కడ పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఆ సమయంలో భారతీయులు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుతున్నట్లు జైస్వాల్‌ చెప్పారు. 

మరోవైపు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా ఈ అంశాన్ని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకొచ్చారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 12 మంది యువకులు దళారుల మాటలు విని మోసపోయి రష్యాకు వెళ్లారని తెలిపారు. వారిలో తెలంగాణ వాసులు ఇద్దరు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలినవారు కర్ణాటక, గుజరాత్‌, కశ్మీర్‌, యూపీలకు చెందినవారన్నారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరినీ ఏజెంట్లు మోసం చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాలు తనకు మొరపెట్టుకోవడంతో మంత్రి జైశంకర్‌తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానన్నారు. ప్రభుత్వం చొరవ చూపి వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ ఆంగ్లపత్రిక ది హిందూ కూడా ఈ అంశంపై ఇప్పటికే కథనం ప్రచురించింది. దీనిని ఓవైసీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. 

అర్ధరాత్రి వేళ.. వారణాసి రోడ్డును తనిఖీ చేసిన మోదీ

మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు మరియుపోల్‌, ఖర్కీవ్‌, రోస్తోవ్‌ ఆన్‌ డావ్‌ వంటి చోట్ల ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు యుద్ధంలో గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే స్పందిస్తూ వీరందరినీ కొందరు దళారులు అక్కడికి పంపారని తెలిపారు. వాగ్నర్‌ కిరాయి సైన్యంలో ఈ యువకులను చేర్చారని చెప్పారు. 

మన పొరుగు దేశమైన నేపాల్‌ నుంచి కూడా భారీసంఖ్యలో యువకులు రష్యాకు వెళ్లి సైన్యంలో చేరారు. వీరి సంఖ్య 200కు పైగానే ఉంటుంది. ఆరుగురు నేపాలీలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తమ పౌరులను సైన్యంలో చేర్చుకోవద్దని ఇప్పటికే నేపాల్‌ ప్రభుత్వం మాస్కోకు విజ్ఞప్తి చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని