Adani group: అదానీ గ్రూప్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌, మోదీపై కోర్టులో దావా

Adani group: అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయకుండా రాహుల్‌, ప్రధాని మోదీని నిలువరించాలంటూ ఓ పిటిషన్‌ దాఖలైంది.

Updated : 27 May 2024 19:51 IST

Adani group | దిల్లీ: ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌పై (Adani group) అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అదానీ గ్రూప్‌పై గానీ, గ్రూప్‌ ప్రమోటర్ గౌతమ్‌ అదానీపై గానీ భవిష్యత్‌లో వీరు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా నిలువరించాలంటూ సూర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ అనే స్టాక్‌ ఇన్వెస్టర్‌ ఈ ఇంజెక్షన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇరువురు నేతల ప్రసంగాల్లో పలుమార్లు అదానీ గ్రూప్‌ ప్రస్తావన రావడం ఇందుకు నేపథ్యం. రాజకీయ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనివల్ల ఆ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన తనలాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లకు నష్టం జరుగుతోందన్నారు.

‘నాలుగేళ్లుగా నిద్రపోయారా?’ - గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

గౌతమ్‌ అదానీ సహా పలువురు పారిశ్రామిక వేత్తలకు కేంద్రం రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని రాహుల్‌ గాంధీ ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయని చెప్పారు. వాస్తవానికి అలాంటి రుణమాఫీ ఏదీ జరగలేదని, అవన్నీ ఆరోపణలేనని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు చదివే వారి మెదడులో అదానీ గ్రూప్‌ కంపెనీలపై చులకన భావం ఏర్పడుతోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కూడా అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ముడుపులు తీసుకుందని ఆరోపించారని పిటిషనర్‌ ప్రస్తావించారు. కాబట్టి అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ, మదుపర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఎలాంటి ఆరోపణలూ చేయకుండా నిలువరించాలంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అదానీ గ్రూప్‌ అధికార ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని