Himachal rains: ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన ఏడుగురు.. జల ప్రళయాన్ని తలపిస్తోన్న దృశ్యాలు..!

Himachal rains: హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షేర్ చేసిన వీడియో భయానకంగా ఉంది.

Updated : 14 Aug 2023 16:56 IST

శిమ్లా: ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) ఈ వానల ధాటికి విలవిల్లాడుతోంది. పదుల సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఆస్తినష్టం కూడా భారీగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Singh Sukhu) షేర్ చేసిన వీడియో ఒకటి వణుకుపుట్టిస్తోంది. అది జలప్రళయాన్ని తలపిస్తోంది. 

హిమాచల్‌లోని మండి జిల్లాలో సంబల్ గ్రామంలో పొంగుపొర్లుతున్న వరదనీటికి సంబంధించిన వీడియో అది. ఆ నీటి ప్రవాహానికి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారని ముఖ్యమంత్రి(Sukhvinder Singh Sukhu) వెల్లడించారు. ఈ భయానక పరిస్థితిని ఎదుర్కొనేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే జతోగ్‌, సమ్మర్‌ హిల్స్ రైల్వే స్టేషన్ మధ్య ఉన్న రైల్వే ట్రాక్ ఈ వర్షాల ధాటికి కొట్టుకుపోయింది. దృశ్యాల్లో ఆ రైల్వే ట్రాక్‌ గాల్లో వేలాడుతున్నట్లు కనిపిస్తోంది.  దాంతో కాందఘాట్‌-శిమ్లా మధ్య తిరిగే రైళ్ల సర్వీసులను రద్దుచేసినట్లు ప్రభుత్వం తెలిపింది.  

చార్‌ధామ్‌ యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేత.. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ఆదివారం నుంచి ఈ వర్షాల వల్ల విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోలన్‌ జిల్లాలోని జాదోన్‌ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన కుంభవృష్టి (Cloudburst)తో ఏడుగురు చనిపోయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. అలాగే కొద్ది గంటల క్రితం శిమ్లా (Shimla)లోని ఓ ఆలయం (Temple)పై కొండచరియలు (Landslides) విరిగిపడి 9 మంది మృతిచెందారు. తాజాగా నీటి ప్రవాహంలో ఏడుగురు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది చనిపోయినట్టు సమాచారం. వర్ష పరిస్థితుల దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను సూచించారు. నేడు, రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఇటీవల హిమాచల్‌లో భీకర వర్షాలు రాష్ట్రాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం వాటిల్లింది. వర్ష సంబంధిత ఘటనల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని