Suman Kumari: బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళ స్నైపర్‌.. సుమన్‌ కుమారి ఘనత

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు.

Updated : 03 Mar 2024 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో ‘సరిహద్దు భద్రత దళాని (BSF)’ది ప్రధాన పాత్ర. ఇంతటి కీలక సాయుధ దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌ (Woman Sniper)గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి (Suman Kumari) చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని ‘సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (CSWT)’లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. ఇటీవలే ‘ఇన్‌స్ట్రక్టర్’ గ్రేడ్ పొందారు. మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపేవారిని ‘స్నైపర్‌’లుగా పేర్కొంటారు.

2021లో బీఎస్‌ఎఫ్‌లో చేరిన కుమారి.. పంజాబ్‌లో ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్‌ దాడుల ముప్పును గమనించారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ‘‘వాస్తవానికి స్నైపర్‌ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. ట్రైనింగ్‌ను తట్టుకోవడం కష్టమని భావిస్తూ చాలామంది పురుషులే వెనకడుగు వేశారు’’ అని అధికారులు తెలిపారు. ఆమె పట్టుదల చూసి ఉన్నతాధికారులు అనుమతించారు. ఎనిమిది వారాలపాటు సాగిన శిక్షణలో 56 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం.

వీర జవాన్లతో.. పాక్‌, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్‌ షా

ట్రైనింగ్‌లో ఎంతో ప్రతిభ కనబరిచారని.. కృషి, నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు ప్రశంసించారు. స్నైపర్ శిక్షకురాలిగా ఆమె అర్హత సాధించారని ‘సీఎస్‌డబ్ల్యూటీ’ ఐజీ భాస్కర్‌ ఓ వార్తాసంస్థతో తెలిపారు. హిమాచల్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్‌ కుమారి తల్లి గృహణి కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్. తాను సాధించిన ఘనతను చూసి.. మరింత మంది మహిళలు భద్రతా బలగాల్లో చేరేందుకు ముందుకొస్తారని ఆమె ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు