Sunita Kejriwal: ‘సునీతా కేజ్రీవాల్‌’ బెస్ట్‌.. దిల్లీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) వీడియో సందేశాలు తమ పార్టీపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్ అన్నారు. 

Published : 05 Apr 2024 16:27 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ అరెస్టు చేసినప్పటికీ.. ఆయన తిహాడ్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాల్సివస్తే తర్వాత సీఎం ఎవరనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. తాజాగా దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సునీతా కేజ్రీవాల్‌ (Sunita Kejriwal) తనను తాను దిల్లీ సీఎం మెసేంజర్‌గా చెప్తుంటారని సౌరభ్‌ మీడియాతో అన్నారు. ‘‘కేజ్రీవాల్ పంపే సందేశాలను ఆమె వినిపిస్తున్నారు. అదంతా పార్టీ కార్యకర్తలు, మా మద్దతుదారులపై గొప్ప సానుకూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఆమె బెస్ట్‌ పర్సన్‌’’ అని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తారా?    అని అడగ్గా..‘‘అదే జరిగితే మేం చాలా సంతోషిస్తాం. పాల్గొనాలా..? వద్దా..? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం’’ అని పేర్కొన్నారు.

పుస్తకాలు.. యోగా.. ధ్యానం: తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య

అరెస్టు తర్వాత ఈడీ కస్టడీ, తిహాడ్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపే సందేశాలను ఇప్పటివరకు సునీత పలుమార్లు వినిపించారు. వాటిద్వారా ప్రజలకు ఆయన ఆలోచనలను తెలియజేస్తున్నారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి పదవికి సునీతతో పాటు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్ పేర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే మద్యం కేసులో అరెస్టయిన మరో ఆప్‌ నేత సంజయ్ సింగ్ బెయిల్‌పై బయటకు వచ్చారు. వచ్చీ రాగానే కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. సీనియర్ నేతల అరెస్టుల నేపథ్యంలో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని