Supreme Court: ప్రజల నమ్మకాన్ని బుట్టదాఖలు చేశారు: సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

‘జిమ్‌కార్బెట్‌లో సఫారీ’ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి, ఓ అధికారి తీరును తప్పుపట్టింది. 

Published : 06 Mar 2024 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ బఫర్‌ జోన్లలో మాత్రమే సఫారీని నిర్వహించాలని సుప్రీం కోర్టు బుధవారం సూచించింది. అడవి మధ్య భాగంలోకి ప్రవేశించి పులుల జీవనాన్ని దెబ్బతీయవద్దని హెచ్చరించింది. ఈ నేషనల్‌ పార్క్‌ మధ్యలో పులుల సఫారీ, జూను ఏర్పాటు చేసి జంతువులను బోన్లలో ప్రదర్శనకు ఉంచాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. దీనిపై జంతుప్రేమికుడు, లాయర్‌ గౌరవ్‌ బన్సల్‌  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఈ క్రమంలో జిమ్‌ కార్బెట్‌లో చెట్ల నరికివేత, అక్రమ నిర్మాణాల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం విచారించింది. న్యాయమూర్తులు స్పందిస్తూ.. ‘‘ఒక అడవి పులిని రక్షిస్తే.. పులి అడవిని రక్షిస్తుంది. వాటి సంరక్షణ నిబంధనలకు సఫారీ నిర్వహణ విరుద్ధం. అయినా కానీ, ఉపాధిని దృష్టిలో పెట్టుకొని కేవలం నేషనల్‌పార్క్‌ బఫర్‌ జోన్‌లో మాత్రమే దానిని నిర్వహించేందుకు కోర్టు అనుమతిస్తోంది. సఫారీ పర్యటనలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే’’ అని తేల్చి చెప్పింది. 

అడవిలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి హరక్‌ సింగ్‌ రావత్‌, డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కిషన్‌ చంద్‌ తీరును కోర్టు తప్పుపట్టింది. ప్రజల విశ్వాసాన్ని నాయకులు, అధికారులు చెత్తబుట్టలో పారేశారని మండిపడింది. ‘‘వ్యాపార లక్ష్యాల కోసం వారు చట్టాలను ఉల్లంఘించారు. పర్యటకం పేరిట భవనాలు నిర్మించేందుకు చెట్లను నరికేశారు. నిబంధనలు వాడుకొంటూ ఈ వ్యవహారం నడిపిన తీరును చూసి ఆశ్చర్యపోతున్నాం’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

దేశంలోని టైగర్‌ రిజర్వులను పరిశీలించి సూచనలు ఇచ్చేందుకు వీలుగా ముగ్గురు సభ్యుల కమిటీని న్యాయస్థానం నియమించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. 

మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది: నీటి సంక్షోభంపై డీకే

ఇదే కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని కోర్టు గుర్తు చేసింది. ‘‘సీబీఐ దర్యాప్తులో బాధ్యులను గుర్తిస్తారు. అదే సమయంలో అడవిలో పూర్వపు పరిస్థితిని పునరుద్ధరించే బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దూరంగా వెళ్లలేదు. అడవికి జరిగిన నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి కచ్చితంగా రికవరీ చేయాలి’’ అని పేర్కొంది. దర్యాప్తు పురోగతి నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని