DK Shivakumar: మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది: నీటి సంక్షోభంపై డీకే

నీటి కొరత బెంగళూరు వాసులను పీడిస్తోంది. ఈ సంక్షోభంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమర్‌ స్పందించారు.    

Updated : 06 Mar 2024 11:43 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో నీటి సంక్షోభం నెలకొంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరతతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. నీటి సమస్యపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar)స్పందించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బెంగళూరు నీటి ఎద్దడితో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మా నివాసంలోని బోరు బావి కూడా ఎండిపోయింది. నీటి డిమాండ్‌ను తీర్చడానికి కాంగ్రెస్‌ సర్కారు తీవ్రంగా యత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తాం. సీఎం, రెవెన్యూ మంత్రి, ఆర్డీపీఆర్‌ మంత్రి, ఇతర మంత్రులతో నీటి సమస్యపై చర్చలు జరిపాం. పట్టణాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను వినియోగించుకుని నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించాం. బెంగళూరు నగరానికి రామనగర, హోస్‌కోట్‌, చన్నపట్న, మాగాడి వంటి పట్టణాల నుంచి ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తాయి’’ అని హామీ ఇచ్చారు.

నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్‌, పర్యవేక్షణకు సెక్యూరిటీ.. హౌసింగ్‌ సొసైటీ నిర్ణయం!

ఈ నేపథ్యంలో కొందరు నీటి ట్యాంకర్ల యజమానులు ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేయడంపై ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని ట్యాంకర్లు రూ. 600కు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని రూ.3 వేల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. నీటి ధరలను ప్రామాణికంగా ఉంచేందుకు అన్ని నీటి ట్యాంకర్ల యజమానులు అధికారుల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని కోరాం. ప్రయాణించే దూరాన్ని బట్టి ధర ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని భాజపా కూడా కారణమేనంటూ శివకుమార్‌ ఆరోపించారు. నగరంలో మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలని కోరారు.

అటు రాష్ట్ర సీఎం కార్యాలయం వద్ద నీటి ట్యాంకర్లు కనిపించడం నీటి సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని