Ayodhya Ram Mandir: అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం

Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

Updated : 17 Apr 2024 19:07 IST

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కన్పించిన ‘సూర్య తిలకం (Surya Tilak)’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.

అద్దాలు, కటకాలతో..

మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.

ప్రతి శ్రీరామనవమి రోజున వచ్చేలా..

ప్రతి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌ టీత్‌ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని