Swati Maliwal assault case: స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన.. కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ అరెస్ట్‌

Swati Maliwal assault case: స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడు బిభవ్‌ కుమార్‌ను దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Updated : 18 May 2024 16:09 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal) చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal aide Bibhav Kumar)ను నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా అతడిని అరెస్టు చేశారు.

ఈ మధ్యాహ్నం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసానికి వెళ్లిన దిల్లీ పోలీసు బృందం.. బిభవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌ను తరలించింది. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. దీనిపై బిభవ్‌ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. తమకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని అన్నారు. విచారణకు సహకరిస్తామని తాము ఈ-మెయిల్‌ చేసినట్లు తెలిపారు.

మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

మే 13వ తేదీన సీఎం నివాసం (Delhi CM residence)లో జరిగిన ఈ ఘటన గురించి ఇటీవల స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిభవ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. నెలసరి నొప్పితో బాధపడుతున్నానని చెప్పినా..  తనపై విచక్షణారహితంగా, పలుమార్లు దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో తాను తీవ్రంగా గాయపడ్డానని, నడవడం కూడా కష్టంగా ఉందని అన్నారు.

అయితే, ఈ ఆరోపణలను బిభవ్‌ ఖండించాడు. ముందస్తు అనుమతి లేకుండా స్వాతి సీఎం నివాసంలోకి దూసుకొచ్చారని, అడ్డుకున్న తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. బిభవ్‌ కూడా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల వేళ సీఎం నివాసం నుంచి స్వాతిని బయటకు పంపిస్తున్న వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేడు విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని