Swati Maliwal: ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్‌ నిరసనపై మాలీవాల్‌

Swati Maliwal: ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు.

Updated : 19 May 2024 13:13 IST

Swati Maliwal | దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై (Swati Maliwal) దాడి ఆరోపణల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. పార్టీ ఆదివారం నిర్వహించ తలపెట్టిన నిరసనను ఉద్దేశించి ఆమె తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాలపై పోరాటం జరగ్గా.. ఇప్పుడు అది నిందితుల రక్షణ కోసం జరుగుతోందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు.. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్‌ను ఫార్మాట్‌ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా?’’ అని మాలీవాల్‌ (Swati Maliwal) ప్రశ్నించారు. తనపై దాడి చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్న కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌కు మద్దతుగా నేటి ఆందోళన కార్యక్రమం జరుగుతోందని పరోక్షంగా ఆరోపించారు. బిభవ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ మాత్రం చొరవ మాజీ మంత్రి మనీశ్‌ సిసోదియా విషయంలో చూపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని మాలీవాల్‌ అన్నారు. ఆయనే గనక బయట ఉంటే ఈరోజు తనకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత ఏడాది అరెస్టయిన సిసోదియా ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

అవినీతి కేసు బూచితో మాలీవాల్‌ను కుట్రలో భాగం చేశారు

భాజపా ప్రధాన కార్యాలయానికి ఆదివారం తాను తమ పార్టీ నేతలతో కలిసి వెళ్తానని కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) శనివారం ప్రకటించారు. ఆ సందర్భంగా ఎవరిని కోరుకుంటే వారిని ప్రధానమంత్రి జైలుకు పంపించుకోవచ్చని పేర్కొన్నారు. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా, దిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌లను జైలుకు పంపడం ఖాయమని భాజపా పేర్కొంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. మనీశ్‌ సిసోదియా, సత్యేంద్ర జైన్, సంజయ్‌ సింగ్‌లను పంపినట్లుగా ఆప్‌ నేతలను జైలుకు పంపడమనే ఆటను ప్రధాని ఆడుతున్నారని ఆరోపించారు.

మే 13న కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ కుమార్‌ తనపై దాడి చేశాడని మాలీవాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమెతో బిభవ్‌ అమర్యాదగా వ్యవహరించింది నిజమేనని పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్‌ వెల్లడించారు. దీన్ని కేజ్రీవాల్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారని.. ఆయనపై చర్యలుంటాయని పేర్కొన్నారు. ఈ పరిణామాల అనంతరం లఖ్‌నవూ విమానాశ్రయంలో కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌తో బిభవ్‌ కనిపించడం గమనార్హం. దీనిపై ఇరువురు నేతలు స్పందించడానికి నిరాకరించారు.

అనంతరం ఎక్స్‌లో ఆప్‌ ఓ వీడియోను విడుదల చేసింది. కేజ్రీవాల్‌ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. అందులో.. సిబ్బంది నుంచి ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు దెబ్బలతో తాను నడవలేని స్థితికి చేరానంటూ, తన దుస్తులు చిరిగిపోయాయంటూ ఆమె చేసిన ఆరోపణలూ అవాస్తవమని తాజా వీడియో తేల్చిందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో ఆమెను భాజపా పావుగా మార్చిందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు