ఒడిశా సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ.. తెరపైకి సురేశ్‌ పుజారి!

ఒడిశా నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జూన్‌ 10న ఉంటుందని భావించినప్పటికీ.. దానిని  12కు వాయిదా వేసినట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 09 Jun 2024 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమవుతోంది. తొలుత జూన్‌ 10న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ.. దానిని 12కు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్‌ కారణంగా తాజా మార్పు చోటు చేసుకుందని భాజపా నేతలు జతిన్‌ మొహంతి, విజయ్‌పాల్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, మరుసటి రోజు నూతన ఎంపీలతో మోదీ భేటీ కానుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు భాజపా శాసనసభా పక్ష సమావేశం కూడా జూన్‌ 11న జరగనుంది. ఈ క్రమంలోనే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.

తెరపైకి పుజారి..

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీనియర్‌ భాజపా నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్‌ పుజారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆయన దిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో పుజారి పేరు కూడా ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో బార్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రజారాజ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.

హ్యాట్రిక్‌ విజయాల మోదీ.. మూడోసారి ప్రధానిగా ప్రమాణానికి రెడీ

అయితే, సీఎం ఎవరనే అంశంపై భాజపా అధిష్ఠానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఉత్కంఠ వీడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందేనని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మన్మోహన్‌ సమాల్‌ శనివారం పేర్కొన్నారు. దీనిపై భాజపా పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇదిలా ఉంటే, రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్‌.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 78 చోట్ల గెలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన కాషాయ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని