Narenda Modi: హ్యాట్రిక్‌ విజయాల మోదీ.. మూడోసారి ప్రధానిగా ప్రమాణానికి రెడీ

కమలదళం నేత నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 09 Jun 2024 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని విజయతీరాలకు చేర్చిన నరేంద్ర మోదీ (Narendra Modi).. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఏ ప్రధానీ వరుసగా మూడుసార్లు తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాలు లేవు. ఆరెస్సెస్‌, ఆ తర్వాత 1985 నుంచి భాజపాతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ.. అంచెలంచెలుగా ఎదిగి, ప్రధాని స్థాయికి చేరుకున్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ (అభివృద్ధి చెందిన భారత్‌) లక్ష్యంగా.. మూడో విడత పాలనలో తనదైన కార్యాచరణతో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

  • 2001లో తొలిసారి గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు తన నేతృత్వంలో రాష్ట్రంలో నాలుగుసార్లు భాజపా ప్రభుత్వాలకు విజయం చేకూర్చిపెట్టారు. గ్రామీణ, పారిశ్రామికీకరణ పథకాలతో గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు.
  • ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమలం పార్టీకి సంపూర్ణ మెజార్టీ సాధించిపెట్టారు. 1984 తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు. 2014లో టైమ్‌ మ్యాగజైన్‌ పాఠకుల పోల్‌లో ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచారు.
  • అంతర్జాతీయంగా భారత్‌ను తయారీ రంగానికి గమ్యస్థానంగా మార్చేందుకుగానూ 2014 సెప్టెంబరులో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టారు. ‘ఎక్కడైనా విక్రయించండి.. కానీ, భారత్‌లో తయారు చేయండి’ అని పారిశ్రామికవర్గాలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ను ప్రారంభించారు.

మోదీ ప్రమాణస్వీకారం వేళ.. దిల్లీలో హైఅలర్ట్‌

  • ఉరీ దాడులకు ప్రతీకారంగా 2016లో పాకిస్థాన్‌ భూభాగాల్లోని ఉగ్రమూకలపై మెరుపుదాడులు నిర్వహించారు. అదే ఏడాది నవంబరులో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. నేడు దేశంలో ప్రతినెలా సగటున రూ.18 లక్షల కోట్ల విలువైన ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుగుతున్నాయి.
  • 2017లో మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌ను ఏకీకృతం చేసింది. దీంతో 1924 నుంచి వేర్వేరుగా ప్రవేశపెడుతోన్న సంప్రదాయానికి ముగింపు పలికినట్లయ్యింది. జులై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. 2019లో పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్‌ దాడులు జరిపింది. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమి ఘన విజయం సాధించడంతో.. మోదీ వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు.
  • రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ని రద్దు చేశారు. అనంతర కాలంలో సీఏఏ, ముమ్మారు తలాక్‌ రద్దు, కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌, వ్యాక్సిన్‌ల పంపిణీ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కొత్త పార్లమెంటు భవనం, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
  • మోదీ పాలనలో ‘గ్లోబల్‌ సౌత్‌’కు భారత్‌ గొంతుకగా మారింది. ‘జీ20’ శిఖరాగ్ర సదస్సు విజయం.. ప్రపంచ వేదికపై దేశ స్థాయిని బలోపేతం చేసింది. గత ఏడాది నవంబరులో ‘చంద్రయాన్‌-3’ ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్‌ అవతరించింది.
  • 2013లో ప్రపంచంలో అయిదు అత్యంత దుర్బలమైన ఆర్థిక వ్యవస్థల జాబితా (ఫ్రాజైల్‌ ఫైవ్)లో ఉన్న భారత్‌.. ప్రస్తుతం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు 290 బిలియన్ డాలర్ల నుంచి 648 బిలియన్ డాలర్లకు పెరిగాయి. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని మోదీ చెబుతున్నారు.

ప్రపంచ చరిత్రలోనే.. ‘అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ’

  • ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశాన్ని ఆయన ఎప్పటికీ కోల్పోరు. ‘మన్‌కీ బాత్‌’తో కోట్లాది ప్రజలకు చేరువయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగమైన సిబ్బంది, కార్మికులతో సంభాషించారు. ఇటీవల గేమర్‌లతో మాట్లాడారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అవార్డులూ అందించారు.
  • ఈ లోక్‌సభ ఎన్నికల్లో ‘మోదీ గ్యారంటీ’ పేరుతో గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. భాజపా సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ను అందుకోలేకపోయినా.. దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకుంది. వారణాసిలో మోదీ హ్యాట్రిక్‌ కొట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని