Arvind kejriwal: ‘మాస్టారూ.. ముందు మీ దేశం సంగతి చూస్కోండి’.. పాక్ ఎంపీకి కేజ్రీవాల్‌ చురక

Arvind kejriwal on pak MP: దేశ సార్వత్రిక ఎన్నికలపై పోస్టు చేసిన పాక్‌ ఎంపీకి అరవింద్‌ కేజ్రీవాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 

Published : 25 May 2024 15:11 IST

Arvind kejriwal | దిల్లీ: భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్‌ ఎంపీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మా వ్యవహారాల్లో తల దూర్చకుండా.. మీ దేశం సంగతి మీరు చూసుకోండి’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. మీ మద్దతు ఏం అక్కర్లేదంటూ హితవు పలికారు.

సార్వత్రిక ఎన్నికల ఆరోవిడతలో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌, తన కుటుంబసభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సంబంధిత చిత్రాన్ని తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను పాకిస్థాన్‌ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్‌ హుస్సేన్‌ రీపోస్ట్‌ చేస్తూ.. ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ పెట్టారు.  దానికి ఇండియా ఎలక్షన్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశారు.

ఈవీఎంలకు ‘భాజపా ట్యాగ్‌’.. స్పందించిన ఈసీ

దీనిపై అరవింద్‌ కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ‘‘చౌధరి సాహిబ్‌.. మా దేశ సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఈ విషయంలో మీ సలహాలేం మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు దాని సంగతి చూడండి. భారత్‌లో ఎన్నికలు అనేవి మా అంతర్గత వ్యవహారం. ప్రపంచం పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే మీలాంటి వారి జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’’ అంటూ అరవింద్‌ కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా దిల్లీలోని మొత్తం 7 స్థానాలకు శనివారం పోలింగ్‌ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4, కాంగ్రెస్‌ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. దిల్లీ సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు