Pune Car Crash: ప్రమాదానికి ముందు.. బార్‌లో 90 నిమిషాల్లో 48వేలు ఖర్చు చేసి..!

Pune Car Crash: ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటనలో నిందితుడైన ఆ మైనర్‌ మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు కూడా అతడు బార్‌లో కేవలం 90 నిమిషాల్లో రూ.48వేలు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Updated : 22 May 2024 10:48 IST

పుణె: మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune car Crash)లో నిందితుడైన టీనేజర్‌ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత వెళ్లిన బార్‌లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు టెకీలు (IT professionals) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉండగా.. ఘటన (Car Accident) నేపథ్యంలో ఆ టీనేజర్‌కు డ్రైవింగ్‌ లైసెన్సుపై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వివేక్ భిమన్వార్‌ వెల్లడించారు. అతడికి 25 ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్‌ లైసెన్సు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?

కార్లు మార్చి.. పారిపోయేందుకు ప్రయత్నించి..

ఈ కేసులో టీనేజర్‌ తండ్రి పుణెలో పేరున్న ఓ రియల్టర్‌. ప్రమాదం గురించి తెలియగానే తనను అరెస్టు చేస్తారని ఊహించిన ఆ వ్యాపారవేత్త పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక కారులో ముంబయి బయల్దేరి.. తనకు చెందిన మరో కారును డ్రైవర్‌తో గోవాకు పంపించాడు. మధ్యలో స్నేహితుల నుంచి కార్లు తెప్పించుకుని అందులోకి మారాడు. నంబరు ట్రాక్‌ చేయకుండా కొత్త సిమ్‌ ఉపయోగించాడు. అయితే, స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్‌ ట్రాకర్‌తో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.

మరోవైపు, ఈ కేసులో కీలక నిందితుడైన ఆ మైనర్‌కు 15 గంటల్లోనే జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అతడి బెయిల్‌ను రద్దు చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు, అతడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని