Pegasus: పెగాసస్‌ హ్యాకింగ్‌.. అలాంటి వాళ్లు సమాచారం ఇవ్వండి..!

తమ ఫోన్లు, పరికరాలను లక్ష్యంగా చేసుకున్న అనుమానిస్తోన్నవ వారు జనవరి 7వ తేదీలోపు తమను సంప్రదించాలని కోరుతూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 03 Jan 2022 01:22 IST

సుప్రీంకోర్టు నియమిత కమిటీ బహిరంగ ప్రకటన

దిల్లీ: గతేడాది వెలుగు చూసిన పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా.. తమ ఫోన్లు హ్యాకింగ్‌ లక్ష్యంగా గురయినట్లు భావిస్తోన్న వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. తమ ఫోన్లు, పరికరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తోన్న వారు జనవరి 7వ తేదీలోపు తమను సంప్రదించాలని కోరుతూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అంతేకాకుండా వారి పరికరాలు లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పే కారణాలు సహేతుకమైనవి భావిస్తే.. వారి అనుమతితో తదుపరి దర్యాప్తు కోసం వారి ఫోన్లను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ, ప్రశాంత్‌ కిశోర్‌, కొందరు కేంద్ర మంత్రులు, మాజీ న్యాయమూర్తులతో పాటు దాదాపు నలభై మంది జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌ తదితరులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రముఖుల ఫోన్లపై నిఘా, వ్యక్తిగత గోప్యతకు భంగం తదితర ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో కూడిన ఈ స్వతంత్ర నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ పర్యవేక్షణలో పనిచేస్తోన్న ఈ కమిటీలో ప్రొఫెసర్‌ నమీన్‌కుమార్‌ చౌదరి (గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ), ఫ్రొఫెసర్‌ పి.ప్రబహరన్‌ (అమృత విశ్వవిద్యాపీఠం), ఫ్రొఫెసర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమస్తే (ఐఐటీ బాంబే) సభ్యులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని