Landslides: ఆలయంపై పడిన కొండచరియలు: 9 మంది మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!

Landslides: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 14 Aug 2023 12:41 IST

శిమ్లా: భారీ వర్షాల (Heavy Rains)తో హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల విపత్కర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శిమ్లా (Shimla)లోని ఓ ఆలయం (Temple)పై కొండచరియలు (Landslides) విరిగిపడి 9 మంది మృతిచెందారు.

సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. దీంతో ఆలయం కుప్పకూలి పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు.

ఉత్తర భారతంలో నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయం కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. ఘటనాస్థలాన్ని సీఎం  పరిశీలించారు. వర్ష పరిస్థితుల దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలు, కొండల ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను సూచించారు.

భారీ వర్షాలు.. పేకమేడలా కూలిన డిఫెన్స్‌ కాలేజీ

పలు ప్రాంతాల్లోనూ వర్ష సంబంధిత ఘటనల్లో మరణాలు సంభవించాయి. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలోనే 21 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి సుఖు తెలిపారు. ఆదివారం సోలన్‌ జిల్లాలోని జాదోన్‌ గ్రామంలో కురిసిన కుంభవృష్టికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో శిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇటీవల హిమాచల్‌లో భీకర వర్షాలు రాష్ట్రాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం వాటిల్లింది. వర్ష సంబంధిత ఘటనల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని