Jammu and Kashmir: కొండల్లో నక్కి.. ‘బ్లైండ్‌ స్పాట్‌’ వద్ద టార్గెట్ చేసి..!

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై దాడికి ఉగ్రవాదులు పక్కాగా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. జవాన్లు వెళ్తున్న మార్గంలోని ఓ బ్లైండ్‌ స్పాట్‌లో నక్కి ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Updated : 22 Dec 2023 21:40 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని పూంఛ్‌ (Poonch) జిల్లాలో జవాన్లను తరలిస్తున్న రెండు సైనిక వాహనాలపై గురువారం ఉగ్రవాదులు కాల్పులకు (Terror Attack) తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముష్కరులు కొండల పైనుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. దాడికి ముందు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

పూంఛ్‌ జిల్లాలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్‌ మధ్య గల ధత్యార్‌ మోర్‌ వద్ద గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ మార్గంలో ప్రమాదకరమైన మూలమలుపు (బ్లైండ్‌ కర్వ్‌ స్పాట్‌) ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు ముందే కొండలపై నక్కారు. ఆ మలుపు వద్ద సైనిక వాహనాలు స్లో అవ్వగానే కొండలపై నుంచి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపగా.. అప్పటికే ముష్కరులు అక్కడి నుంచి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.

‘భారత్‌ను చైనాతో పోల్చొద్దు..!’ మోదీ కీలక వ్యాఖ్యలు

అయితే, దాడికి ముందు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో రెక్కీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ధేరా కి గాలి ప్రాంతంలో ఓ ఆపరేషన్‌ కోసం అదనంగా సైనికులను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల రాజౌరీ జిల్లాలో కూడా ఉగ్రవాదులు ఇలాగే చిన్నపాటి గుహల్లో నక్కి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు యువ కెప్టెన్లు, ముగ్గురు జవాన్లు అమరులయ్యారు.

ముష్కరుల కోసం వేట..

దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఉగ్రవాదుల కోసం అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. జాగిలాలతో పాటు డ్రోన్లను ఉపయోగించి అన్వేషిస్తున్నారు. అవసరమైతే అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి ముష్కరులను పట్టుకుంటామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని