Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూక చేతికి చైనా ఆయుధాలు..

ఉగ్రవాదులు చైనా తయారీ పరికరాలను వాడుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇవి చైనా నుంచి పాకిస్థాన్‌ సైన్యానికి చేరగా.. అక్కడి నుంచి పీవోకేకు తరలిస్తున్నారు.

Updated : 26 Dec 2023 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులకు చైనా నుంచి సాయం అందుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకూ అమెరికా తయారీ ఎం4 రైఫిళ్లను మాత్రమే ఉగ్రమూక వాడినట్లు గుర్తించారు. తాజాగా ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేవారు చైనా తయారీ ఆయుధాలు, బాడీసూట్‌ కెమెరాలు, కమ్యూనికేషన్‌ పరికరాలను వినియోగిస్తున్నట్లు తేల్చారు. దీనికి అదనంగా చైనా నుంచి డ్రోన్లు, హ్యాండ్‌ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు కూడా పాక్‌ ఆర్మీకి చేరుతున్నాయి. ఈ ఏడాది జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల్లో వీటిని వాడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ముఖ్యంగా చైనా సాంకేతికతతో తయారైన స్నైపర్‌ తుపాకులను ముష్కరులు వినియోగిస్తున్నారు. గత నవంబర్‌లో చొరబాట్లకు యత్నిస్తున్న సమయంలో పాక్‌ నుంచి ఓ స్నైపర్‌ కాల్పులు జరిపాడు. దీనికి తోడు ఈ ఏడాది జరిగిన మూడు భారీ ఉగ్రదాడుల్లో కూడా ముష్కరులు చైనా తయారీ బాడీ సూట్‌ కెమెరాలను వాడినట్లు తేలింది. బీజింగ్‌ టెక్నాలజీతో పనిచేసే ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థలు కూడా వారి చేతిలో ఉన్నాయని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. తరచూ చైనా నుంచి పాకిస్థాన్‌కు ఆయుధాలు, కెమెరాలు, కమ్యూనికేషన్‌ పరికరాలు అందుతూనే ఉన్నాయి. వీటిని పాక్‌ సైన్యం వినియోగించకండా.. పీవోకేలో ఉగ్ర సంస్థలకు చేరవేస్తోంది. చొరబాట్లకు ఈ పరికరాలను వాడుతున్నారు.

అంతేకాదు పాక్‌ వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ వ్యవస్థ బలోపేతం చేసే కార్యక్రమాన్ని చైనానే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్‌ వార్ఫేర్‌ నిమిత్తం ఇప్పటికే పాకిస్థాన్‌లో ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏర్పాటుకు నిధులను సమకూర్చింది.

ఆ గుహలను కూల్చేయండి.. : ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

ఉగ్రవాదం విషయంలో ఉపేక్షించవద్దని ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే స్థానిక కమాండర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులు నక్కిన  గుహలను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాజౌరీ-పూంఛ్‌ ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డేరా కి గలీ, బుఫ్లియాజ్‌ ప్రాంతాలపై సైన్యం దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిన్న ఆర్మీ చీఫ్‌ జమ్మూలోని నగ్రోటాలో ఉన్న వైట్‌నైట్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 

కశ్మీర్‌లో ఆపరేషన్లపై స్థానిక వైట్‌నైట్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంలో రక్షణ మంత్రి కూడా రివ్యూ మీటింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో కూడా సమావేశం కావొచ్చు.

మానవ మెదడును అనుకరించొచ్చు!

ఇటీవల ఉగ్రదాడి తర్వాత ముగ్గురు పౌరుల మరణాలు జమ్మూలో ఆందోళనలకు కారణం అయ్యాయి. దీనికి సంబంధించి ఓ బ్రిగేడియర్‌ స్థాయి అధికారిని ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి పూంఛ్‌ బయటకు బదిలీ చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగుతోంది.

గత గురువారం పూంఛ్‌ జిల్లాలో రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో దాడులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు. దీంతో ముష్కరుల ఆటకట్టించేందుకు సైన్యం భారీ ఎత్తున దళాలను రాజౌరీ-పూంఛ్‌ ప్రాంతంలో మోహరించి ఉగ్ర నిరోధక గ్రిడ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని