Mahua Moitra: దుబాయ్‌ నుంచి 47సార్లు లాగిన్‌.. మహువా మొయిత్రా కేసులో కీలక విషయాలు..!

టీఎంసీ ఎంపీ మహుమా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ ఖాతాలోకి దుబాయ్‌ నుంచి 47 సార్లు లాగిన్‌ అయినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. వ్యాపారవేత్త హీరానందానికి చెందిన ప్రదేశాల నుంచి ఈ లాగిన్‌ అయినట్లు తెలుస్తోంది.

Published : 01 Nov 2023 17:35 IST

దిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణల (Cash-for-query Row)ను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (TMC MP Mahua Moitra) కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్‌ (Dubai) నుంచి 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలపై మహువా.. గురువారం లోక్‌సభ నైతిక కమిటీ విచారణ ఎదుర్కోనున్న సమయంలో ఈ విషయాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వార్తలపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే (BJP MP Nishikant Dubey) ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘దుబాయ్‌లోని వ్యాపారవేత్త హీరానందానికి చెందిన ప్రదేశాల నుంచి మహువా లోక్‌సభ ఖాతాలోకి 47 సార్లు లాగిన్‌ (log in) అయినట్లు, అక్కడి నుంచే పలు ప్రశ్నలు సంధించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు నిజమైతే.. దేశవ్యాప్తంగా ఎంపీలందరు ఆమె అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలి. హీరానందని స్వప్రయోజనాల కోసం ఆయనే ఈ ప్రశ్నలు అడిగారని రుజువైనట్లే. పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఎంపీలుగా పనిచేస్తున్నామా?’’ అని దూబే దుయ్యబట్టారు.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి మహువా మెయిత్రా డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె తన పార్లమెంటరీ లాగిన్‌ వివరాలను కూడా హీరానందానికి ఇచ్చినట్లు దూబే ఆరోపించారు. అటు హీరానందాని కూడా మహువాకు లంచం ఇచ్చానని అంగీకరించినట్లుగా ఆయన పేరుతో ఓ అఫిడవిట్‌ బయటికొచ్చింది. ఈ ఆరోపణలను మహువా తీవ్రంగా ఖండించారు. అయితే, హీరానందానికి తన లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. కానీ, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని, ప్రశ్నలన్నీ తానే అడిగానని పేర్కొన్నారు. అంతేగాక, హీరానందానితో కేంద్రం బలవంతంగా ఆ అఫిడవిట్‌పై సంతకం చేయించిందని మహువా ఆరోపించారు.

ఆరోపణలన్నీ అసత్యాలని నిరూపిస్తా: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వెల్లడి

మరోవైపు, ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ.. ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె గురువారం కమిటీ ఎదుట హాజరుకానున్నారు. అయితే, తనకు లంచం ఇచ్చానని హీరానందాని అంగీకరించినట్లుగా ఉన్న అఫిడవిట్‌పై ఆయనను ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని మహువా ఎథిక్స్‌ కమిటీని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని