Pakistan: ‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ

ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 17:33 IST

భోపాల్: ప్రస్తుతం కొనసాగుతోన్న లోక్‌సభ (Lok Sabha Elections) ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచ శక్తిగా మారుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరిచిందని ఆరోపించారు. ‘రక్షణ రంగంలో దేశం స్వావలంబన కోసం భాజపా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్నో దేశాలకు ఆయుధాలను భారత్‌ సరఫరా చేస్తోంది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణలు ఎగుమతి చేస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదులను సరఫరా చేసే పొరుగుదేశం, నేడు పిండి కోసం పాట్లు పడుతోందని విమర్శించారు.

నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్‌

ఫ్రాన్స్‌ తయారుచేసిన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు రావడం విపక్ష పార్టీకి ఇష్టం లేదని కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.  తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా రేషన్‌ అందించే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లు పొడిగించామన్నారు. దీనిద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతారని అన్నారు.

అన్సారీపై మోదీ ప్రశంసలు..

రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడం గొప్ప విషయమన్నారు. అదే కాంగ్రెస్‌ పార్టీ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని