మోడల్స్‌పై చెత్త విసురుతూ... వైరల్‌గా అవ‘వావ్‌’ ఫ్యాషన్‌ షో..

ఇటాలియన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అవవావ్(AVAVAV) మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2024లో నిర్వహించిన ఫ్యాషన్‌షో వైరల్‌గా మారింది.

Published : 27 Feb 2024 01:53 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇటాలియన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అవవావ్(AVAVAV) మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2024లో నిర్వహించిన ఫ్యాషన్‌షో వైరల్‌గా మారింది. దీనికి కారణం అందులో మోడల్స్‌  వేదికపై నడుస్తున్న సమయంలో వారిపై చెత్తను, పానీయాలను విసరడమే. ఈ విచిత్ర ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

 ఫ్యాషన్‌ బ్రాండ్‌ AVAVAVపై ఆన్‌లైన్‌లో చెత్త బ్రాండ్‌గా వచ్చిన ట్రోల్స్‌, వ్యతిరేకతలే ప్రేరణగా తీసుకున్న బ్రాండ్‌ యజమాని బీట్‌ కార్ల్‌సన్‌ ఈవిధంగా కొత్తగా, వింతగా ఆలోచించి మోడల్స్‌ చెత్తను ఉపయోగిస్తూ ఫ్యాషన్‌ షోలో పాల్గొనేలా థీమ్‌ను రూపొందించారు. చుట్టూ చెత్తతో నిండి ఉన్న వేదిక మీదే ఫ్యాషన్‌ షో నిర్వహించి విమర్శకుల నోర్లు మూయించారు. 

కాని ప్రేక్షకులు, నెటిజన్లలో మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్‌ స్పందిస్తూ మోడల్స్‌ ముఖంపై పానీయాలను చల్లడం వారిని అవమానించడమే అవుతుంది. అగౌరవపరిచినట్లుగా ఉంటుంది. ఇది ఫ్యాషన్‌ షోలకే అవమానకరం అని విమర్శించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ AVAVAV బ్రాండ్‌ను ప్రోత్సహించండి. దీని ఫ్యాషన్‌ షో ప్రతిసారీ ప్రత్యేకంగా ఉంటుంది. నిష్పాక్షికంగా వ్యవహరిస్తుంది అంటూ మద్దతు తెలిపారు.

దీనిని తన బ్రాండ్‌కు మళ్లీ మంచి పేరు తీసుకొచ్చే అవకాశంగా బీట్‌ ఉపయోగించుకున్నారు. మిలన్‌ ఫ్యాషన్‌ వీక్ దీనిపై తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఇలా రాసుకొచ్చింది. ‘‘ ఈ ప్రదర్శనలో బ్రాండ్‌ సామాజిక మాధ్యమాలలో తిరస్కారానికి గురైన విషయాన్ని మోడల్స్‌పై చెత్తను చల్లుతూ తెలియజేశాం.’’ 

ఈ డిజైనర్ ఇలా తన విచిత్ర ఆలోచనలతో సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గత సెప్టెంబర్‌లో అవవావ్ ‘డిజైన్ చేయడానికి సమయం లేదు, వివరించడానికి సమయం లేదు’ అనే కాన్సెప్ట్‌తో ఫ్యాషన్‌ షోను ప్రదర్శించారు. ఇందులోభాగంగా మోడల్స్‌ సగం సగం దుస్తులు వేసుకుంటూ హడావిడిగా వేదిక పైకి పరిగెత్తుతూ వస్తుండడంతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని