Viral news: ఈ చిన్నోడి టాలెంట్‌ చూస్తే.. ‘ఔరా’ అనాల్సిందే!

ఓ బుడ్డోడు తన విలువిద్యతో అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించిన తీరు ఆకట్టుకుంటోంది.

Updated : 28 Jul 2023 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ విదేశాల్లో ఏ మూలన ఆసక్తికర ఘటన జరిగినా ఇట్టే వైరల్‌ అయిపోతోంది. అలా మట్టిలోని మాణిక్యాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్‌ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి ఆమడ దూరంలో ఉన్న బెలూన్‌ను గురి చూసి కొట్టాడు. అందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ బాలుడు బాణాన్ని సంధించింది చేతులతో కాదు.. కాళ్లతో. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఐఫోన్‌ కోసం కన్నబిడ్డను అమ్మేశారు.. రీల్స్‌ మోజుతో తల్లిదండ్రుల అమానవీయం

ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. ‘బుడతా.. నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌’ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని... కలియుగ అర్జునుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో నీటిలో ప్రతిబింబాన్ని చూసి అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తే.. ఈ అర్జునుడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ చిన్నోడి టాలెంట్‌ ఏంటో మీరూ చేసేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని