Modi: మోదీ పర్యటన వేళ ‘ఆత్మాహుతి దాడి’ బెదిరింపులు.. కేరళలో హైఅలర్ట్‌

ప్రధాని మోదీ సోమవారం కేరళలో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటన వేళ ఆత్మాహుతి దాడులు చేపడతామంటూ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Updated : 22 Apr 2023 16:39 IST

తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) కేరళ పర్యటనకు  (Kerala Visit) బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని పర్యటన సమయంలో ఆత్మాహుతి దాడులు (suicide attack) జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

భాజపా (BJP) రాష్ట్ర కార్యాలయానికి గతవారం ఈ బెదిరింపు లేఖ రాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. మోదీ (Modi) కోచి పర్యటనలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ ఆ లేఖలో బెదిరించారు. దీంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ ఆ లేఖను అదనపు డైరెక్టర్‌ జనరల్‌  (ఏడీజీపీ ఇంటెలిజెన్స్‌ విభాగం) టీకే వినోద్‌ కుమార్‌కు అందించారు. దీంతో ఇంటెలిజెన్స్‌ విభాగం దర్యాప్తు చేపట్టింది. అయితే, ప్రధాని మోదీ (PM modi) పర్యటన సమయంలో భద్రతా ప్రొటోకాల్స్‌పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్‌ అవడంతో ఈ లేఖ విషయం బయటికొచ్చింది.

ఈ బెదిరింపు లేఖపై పోలీసులు (Kerala Police) దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్‌ అవడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ లేఖ నేపథ్యంలో ప్రధాని కేరళ పర్యటన (Modi Kerala Visit)పై అనిశ్చితి నెలకొంది. అయితే, షెడ్యూల్‌ ప్రకారమే అన్ని కార్యక్రమాలు ఉంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం.. ప్రధాని మోదీ ఏప్రిల్‌ 24 కేరళకు రానున్నారు. కోచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని