Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!

శత్రు జలాంతర్గములను ఎదుర్కొనేందుకు భారత్‌ నౌకాదళానికి అదనపు శక్తి లభించింది. మూడు సరికొత్త యుద్ధ నౌకలు నేడు నౌకాదళానికి అందుబాటులోకి వచ్చాయి.  

Published : 30 Nov 2023 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత నౌకాదళం చేతికి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలు అందాయి. కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మిస్తున్న మొత్తం ఎనిమిది నౌకల్లో భాగంగా తయారైన మూడు షిప్‌లను నేడు ప్రారంభించారు. ఈ నౌకలకు ఐఎన్‌ఎస్‌ మహె, ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌, ఐఎన్‌ఎస్‌ మాంగ్రోల్‌ అని పేర్లుపెట్టారు. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌, స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌ అధిపతి సురాజ్‌ బెర్రీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ కమాండంట్‌ పునీత్‌ భల్‌ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌ మాట్లాడుతూ.. భారత్‌కు అద్భుతమైన నౌకానిర్మాణ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. 

81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు

మొత్తం ఎనిమిది మహె ఏఎస్‌డబ్ల్యూ నౌకలను నిర్మించేందుకు 2019లో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఈ నౌకలు ఇప్పటికే నేవీలో ఉన్న అభయ్‌ శ్రేణి ఏఎస్‌డబ్ల్యూ కార్వెట్టీల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ కొత్త నౌకలు తీరప్రాంతాల్లో యాంటీ సబ్‌మెరైన్‌ ఆపరేషన్లు, సముద్రంలో మందుపాతరలను పర్చడం, నిఘా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ నౌకల్లో తేలికపాటి టోర్పెడోలు, యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో వినియోగించే రాకెట్లు, మైన్స్‌, 30 ఎంఎం గన్స్‌, 12.7ఎంఎం స్టెబిలైజ్డ్‌ రిమోట్‌ కంట్రోల్‌ గన్స్‌ ఉన్నాయి. 

ప్రతి నౌక 78 మీటర్ల పొడవు, 11.36 మీటర్ల వెడల్పుతో 896 టన్నుల బరువు ఉన్నాయి. ఇవి సముద్ర జలాల్లో అత్యధికంగా గంటకు 25 నాట్స్‌ (45 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలవు. ఒక్కసారి ప్రయాణం ప్రారంభిస్తే.. 1,800 నాటికల్‌ మైళ్లు వెళ్లగలవు. ఈ నౌకల్లో దేశీయంగా తయారు చేసిన సోనార్లు, సముద్రగర్భ నిఘా పరికరాలు ఉంటాయి. ఈ నౌకలో 57 మంది సిబ్బంది ఉంటారు. దేశ నౌకాశక్తికి ఇది నిదర్శనంగా నిలిచిందన్నారు. ఇక షిప్‌యార్డ్‌ సీఎండీ మధు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వంటి సమస్యలను ఎదుర్కొన్నా, విదేశీ మారకద్రవ్య, ఉక్రెయిన్‌ యుద్ధ సమస్యలున్నా.. ఈ నౌకలను తాము నిర్ణీత ధరకే అందజేశామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని