LS polls: బెంగాల్‌లో బెనర్జీ దూకుడు.. చతికిలపడ్డ భాజపా

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడును భాజపా ఏమాత్రం అడ్డుకోలేక పోతున్నట్లు తాజా లోక్‌సభ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

Published : 04 Jun 2024 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి. అయితే, ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడును ఏమాత్రం అడ్డుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. క్రితం లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించిన భాజపా.. ఈసారి 10 సీట్లకే పరిమితమైపోతున్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. టీఎంసీ మాత్రం 31 స్థానాల్లో సత్తా చాటుతోంది. ఎన్నికల సంఘం వెల్లడిస్తోన్న సమాచారం ప్రకారం..

రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ 31 స్థానాల్లో ముందంజలో ఉంది. పది స్థానాల్లో మాత్రమే భాజపా లీడ్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధరీ గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఓట్ల శాతంలోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ 47శాతం ఓట్లతో దూసుకెళ్తోంది. భాజపా 37శాతం, కాంగ్రెస్‌ 4.63శాతం ఓట్లతో తమ ఆధిక్యాలను ప్రదర్శిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈసారి మరింత బలపడి 31 స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది.

ఫలితాల ధోరణిపై టీఎంసీ స్పందిస్తూ.. రాష్ట్రంలో తాము ఆశించిన రీతిలోనే ఫలితాలు వచ్చాయని పేర్కొంది. భాజపా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓటు వేశారని, మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా భాజపా అనుకూల మీడియా ఇచ్చిన అంచనాలేనని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని