Cheetah deaths: చీతాల మృత్యువాత.. కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో చీతాలు మరణిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అంత మంచి సంకేతం కాదని తెలిపింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Updated : 20 Jul 2023 17:42 IST

దిల్లీ: ‘ప్రాజెక్ట్‌ చీతా’ (Project Cheetah)లో భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మరణిస్తుండటంపై సుప్రీంకోర్టు (SupremeCourt) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా నమీబియా (Namibia), దక్షిణాఫ్రికా (South Africa)ల నుంచి 20 చీతాలను తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టారు. ఇందులో ఇప్పటి వరకు 8 చీతాలు మరణించాయి. మరో రెండు చీతాల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన వాటిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయని, ఇది మంచి సంకేతం కాదని పేర్కొంది. వరుసగా మృత్యువాత పడుతున్నప్పటికీ ఇంకా వాటిని కునో నేషనల్‌ పార్కులోనే ఎందుకు ఉంచుతున్నారని, వేరే చోటకి తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ఆరా తీసింది. దీనిపై కూలంకషంగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.

ప్రాజెక్ట్‌ చీతా ప్రారంభ దశలో.. జాతీయ పులుల సంరక్షణ సంస్థకు మార్గదర్శం చేయాలంటూ కేంద్రం నియమించిన నిపుణుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.  త్రిసభ్య ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు.  ప్రాజెక్టు చేపట్టక ముందే చీతాల మరణాల గురించి  కేంద్రం చర్చించిందని, వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని చీతాలు మృత్యువాత పడతాయని ముందుగానే ఊహించిందని కోర్టుకు తెలిపారు. మరోవైపు నిపుణుల కమిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ చంద్రసేన్‌ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఎన్ని చీతాలు మృత్యువాత పడ్డాయని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆయన్ను ప్రశ్నించారు. 8 చీతాలు మృతి చెందినట్లు అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.

మణిపుర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌..!

40శాతం చీతాలు మృత్యువాత పడినప్పటికీ కేంద్రం ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వాటిని వేరే చోటకి తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. మరోవైపు ‘ ప్రాజెక్టు చీతా’పూర్తి వివరాలను నిపుణుల కమిటీకి అందజేయాలని, కమిటీ చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రశాంత్‌ చంద్రసేన్‌ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది.ఈ క్రమంలోనే నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘సాశా’ అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ‘ఉదయ్‌’ అనే మగ చీతా ఏప్రిల్‌ 23న మృత్యువాతపడ్డాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా ‘దక్ష’ మే 9న మృతి చెందింది. అదే నెలలో ‘జ్వాల’ అనే చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు చనిపోయాయి. ఈ నెలలో రెండు మరణాలతో కలిపి.. మొత్తం 4 నెలల వ్యవధిలో చీతాల మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని