Manipur Video: మణిపుర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌..!

మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

Updated : 20 Jul 2023 15:08 IST

దిల్లీ: మణిపుర్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ ఘటన తనను ఆందోళనకు గురిచేశాయని, ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందన్నారు. 

ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమైన ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని పేర్కొంది.

నగ్నంగా మహిళల ఊరేగింపు.. వీడియోలు తొలగించాలని కేంద్రం ఆదేశాలు..!

గత నెల రోజులుగా మణిపుర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోలపై రాజకీయ, సినీ ప్రముఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని