Farmers Protest: ‘26న హైవేలపై ట్రాక్టర్‌ ర్యాలీలు.. మార్చి 14న మహాపంచాయత్‌’

రైతుల ఆందోళనలకు మద్దతుగా ఈనెల 26న దేశవ్యాప్తంగా హైవేలపై ట్రాక్టర్‌ ర్యాలీలు, మార్చి 14న దిల్లీలో ‘మహాపంచాయత్’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.

Published : 22 Feb 2024 22:50 IST

చండీగఢ్‌: అన్నదాతల ఆందోళన (Farmers Protest)ల క్రమంలో పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ వద్ద ఓ యువ రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మృతిపై హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హోం మంత్రి అనిల్‌ విజ్‌లపై హత్య కేసు నమోదుచేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) డిమాండ్‌ చేసింది. ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం ‘బ్లాక్‌ ఫ్రైడే’ పాటించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 26న దేశవ్యాప్తంగా హైవేలపై ట్రాక్టర్‌ ర్యాలీలు, మార్చి 14న దేశ రాజధాని దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘మహాపంచాయత్ (Mahapanchayat)’ నిర్వహించనున్నట్లు తెలిపింది. రైతుల ఆందోళనలపై గురువారం సమావేశమైన ఎస్‌కేఎం నేతలు.. ఈమేరకు ఓ కార్యాచరణను ప్రకటించారు.

రైతుల నిరసనల వేళ.. మోదీ పోస్టు

శుభ్‌కరణ్‌సింగ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం చెల్లించాలని ఎస్‌కేఎం నేత బల్బీర్‌సింగ్‌ రజేవాల్‌ డిమాండ్‌ చేశారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో ఎస్‌కేఎం (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాల ఆధ్వర్యంలో రైతులు ‘దిల్లీ చలో’ ఆందోళనను తలపెట్టారు. అయితే.. పంజాబ్‌- హరియాణా సరిహద్దుల్లోనే పోలీసులు వారిని కట్టడి చేస్తున్నారు. రైతు సంఘాల నాయకులతో కేంద్రం ఇప్పటివరకు నాలుగుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎస్‌కేఎం.. ప్రస్తుత ఆందోళనల్లో భాగం కానప్పటికీ మద్దతు ఇస్తోంది. ఈ వ్యవహారంలో ఎస్‌కేఎం (రాజకీయేతర)తో సమన్వయానికి గురువారం ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని