Rameshwaram Cafe Blast: రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌ నిందితుల అరెస్టు.. భాజపా-బెంగాల్‌ పోలీసుల ‘ఎక్స్‌’ వార్‌

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కెఫే పేలుడు కేసు నిందితులు పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడటం భాజపా, టీఎంసీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది. 

Updated : 12 Apr 2024 16:50 IST

కోల్‌కతా: కర్ణాటకకు చెందిన రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసు ప్రధాన నిందితులను పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో అరెస్టు చేశారు. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామం అంటూ భాజపా (BJP) చేసిన విమర్శలను తృణమూల్ కాంగ్రెస్(TMC) తీవ్రంగా ఖండించింది. (Rameshwaram Cafe Blast)

‘‘కోల్‌కతా సమీపంలో రామేశ్వరం కెఫే పేలుడు కేసు నిందితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బెంగాల్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది’’ అని ఎక్స్‌ వేదికగా కమలం పార్టీ నేత అమిత్‌ మాలవీయ వ్యాఖ్యలు చేశారు. దీనికి బెంగాల్ పోలీసులు దీటుగా బదులిచ్చారు. ‘‘అసత్య ప్రచారం మరింత దిగజారింది. వాస్తవం ఏంటంటే.. బెంగాల్‌ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు జరిపిన సంయుక్త ఆపరేషన్ ద్వారా ఆ ఇద్దరిని పుర్బా మేదినీపుర్‌లో అదుపులోకి తీసుకున్నాం.  మా ప్రజలను సురక్షితంగా ఉంచడంలో మేం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాం’’ అని సమాధానం ఇచ్చారు.

‘రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌’ కేసులో..టోపీ ఆధారంగా బాంబర్‌ అరెస్ట్‌..!

భాజపా విమర్శలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆ నిందితులు బెంగాల్‌ వాసులు కారు. వారు ఇక్కడ నక్కారు. రెండు గంటల్లోనే అరెస్టయ్యారు. మా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉంటే.. భాజపా సహించలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌ రాష్ట్రాలు సురక్షితంగా ఉన్నాయా..?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నామని స్వయంగా జాతీయ దర్యాప్తు సంస్థే(NIA) వెల్లడించిందని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్ వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని