Truck Drivers: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్ల ఆందోళన

హిట్ అండ్‌ రన్‌ కేసులో కొత్త చట్టం ప్రకారం విధించే శిక్షలు తమను నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయని డ్రైవర్ల సంఘాలు ఆరోపించాయి.

Updated : 01 Jan 2024 18:16 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా లారీ, ప్రైవేటు బస్‌ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కొత్త చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో శిక్ష పెంపును వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. పాత చట్టం ప్రకారం హిట్‌ అండ్‌ రన్‌ కేసులో దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు. నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో పదేళ్లు జైలు శిక్ష, రూ.ఏడు లక్షలు జరిమానా విధించేలా మార్పులు చేశారు. నూతన చట్టం వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆరోపించాయి. 

‘‘ఉద్దేశపూర్వంగా యాక్సిడెంట్ చేయాలని ఎవరూ అనుకోరు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో మూక దాడి జరిగే అవకాశం ఉంటుందనే భయంతో అక్కణ్నుంచి వెళ్లిపోతారు. కొన్నిసార్లు పొగ మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. అందుకు డ్రైవర్‌కు పదేళ్లు జైలు శిక్ష విధించడం సమంజసం కాదు. ఇప్పటికే రవాణా రంగం 30 శాతం డ్రైవర్ల కొరతను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కొత్త చట్టం కారణంగా ఈ వృత్తిని చేపట్టేందుకు కొత్తవాళ్లు ఆసక్తి చూపించరు’’ అని డ్రైవర్ల సంఘాల నాయకులు ఆరోపించారు. 

‘కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం’.. ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ

ఈ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ, హరియాణా, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో లారీ డ్రైవర్లు జాతీయ రహదారులను నిర్బంధించి తమ నిరసన తెలిపారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో విధించే శిక్షకు సంబంధించి డ్రైవర్ల సంఘాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని